• Login / Register
  • జ‌న‌ర‌ల్ న్యూస్‌

    The Pushpa-2 | రోడ్ షో వ‌ల్లే ఆ.. ప్ర‌మాదం జ‌రిగింది

    The Pushpa-2 | రోడ్ షో వ‌ల్లే ఆ.. ప్ర‌మాదం జ‌రిగింది
    సిని న‌టుడు అల్లు అర్జున్‌పై  సీఎం ఫైర్‌

    Hyderabad  : ప్ర‌ముఖ సిని న‌టుడు అల్లు అర్జున్‌పై ఫైర్ అయ్యారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఏ రేవంత్‌రెడ్డి.  ‘పుష్ప 2’ మూవీ ప్రీమియర్ల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కొడుకు శ్రీ తేజ్ ఇప్పటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథంలోనే అల్లు అర్జున్ తో పాటు థియేటర్ మేనేజ్మెంట్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేర‌కు కేసు విచారణలో భాగంగా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారన్న విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ పై బయట ఉన్న సంగతి కూడా తెలిసిందే. అయితే తాజాగా అసెంబ్లీ స‌మావేశాలు జరుగుతున్న వేళ ఈ ఘటన గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అసలేం జరిగిందో వివరించారు. 
    సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
     “అల్లు అర్జున్ అరెస్ట్ చేయడంతో రాజకీయ పార్టీలు నన్ను తిట్టుకుంటున్నాయి. పైగా హీరోని అరెస్ట్ చేస్తే సెలబ్రిటీలు వెళ్లి పరామర్శించారు. హాస్పిటల్ లో ఉన్న శ్రీ తేజ దగ్గరికి ఒక్కరు కూడా వెళ్లలేదు. నిజానికి అల్లు అర్జున్ థియేటర్ కి రావడానికి అనుమతి లేదు. ఆయన వచ్చిన తర్వాతే ప్రమాదం జరిగింది. అప్పటికి థియేటర్ కి ఒక్కటే గేట్ ఉండడం వల్ల క్రౌడ్ ను కంట్రోల్ చేయలేము. హీరో, హీరోయిన్లు అక్కడికి రావద్దని పోలీసులు ముందుగానే చెప్పారు. అయినప్పటికీ అల్లు అర్జున్ అక్కడికి వచ్చారు. ఊరికే వచ్చిపోతే పెద్దగా సమస్య ఉండేది కాదేమో. కానీ ఆయన థియేటర్ కు వెళ్లే దారిలోనే కారు రూఫ్ టాప్ నుంచి అభివాదం చేసుకుంటూ వెళ్లడంతో చుట్టుపక్కల ఉన్న థియేటర్ల జనాలు కూడా ఆయనను చూడడానికి ఇక్కడికి వచ్చారు. దీంతో వేలాది మంది జనాలు గుమిగూడారు. బన్నీ కారు కోసం గేట్ ఓపెన్ చేయగానే వేలాది మంది పరుగులు తీశారు. 
    ఇక అల్లు అర్జున్ బౌన్సర్లు  60 మంది వ‌ర‌కు ఉన్నారు. వాళ్లు అల్లు అర్జున్ చూడడానికి ఎగబడుతున్న జనాలను కంట్రోల్ చేయడానికి ట్రై చేయడం, థియేటర్లో అల్లు అర్జున్ ఎక్కడో బాల్కనీలో కూర్చుంటే..  అభిమానులు సినిమాను చూడకుండా కింద సీటు వైపు నుంచి ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి.. పైకి కోతుల్లా ఎక్కడంతో మళ్లీ తొక్కిసలాట జరిగింది. అయితే తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది అని అల్లు అర్జున్ కు తెలియజేయడానికి పోలీసులు వస్తే, థియేటర్ యాజమాన్యం చాలా సేపు అతన్ని కలవడానికి అనుమతిని ఇవ్వలేదు. ఈ క్ర‌మంలో ఎసిపి సీరియస్ కావడంతో చివరికి అనుమతించారు. ఇప్పటికే ఇద్దరు చనిపోయారు మీరు ఇంకా ఇక్కడ ఉంటే అభిమానులను కంట్రోల్ చేయలేము. మేము లాఠీ ఛార్జ్ చేయాల్సి ఉంటది అని పోలీసులు చెప్పినప్పుడు, అల్లు అర్జున్ సినిమా పూర్తయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పారని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది. 
    ఇంకా కంట్రోల్ కాకపోవడంతో డిసిపి రంగంలోకి దిగి, పరిస్థితి గందరగోళంగా మారింది. మీరు ఇక్కడి నుంచి వెళ్లాల్సిందే అని బలవంతంగా అతన్ని తీసుకొచ్చి బండి ఎక్కించారు. అయినప్పటికీ అల్లు అర్జున్ బయటకు వచ్చాక కూడా రూఫ్ టాప్ ఓపెన్ చేసి అభివాదం చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్లారు. తల్లి చనిపోయింది, కొడుకు ప్రమాదంలో ఉన్నాడు అని చెప్పాక కూడా బన్నీ రోడ్ షో చేసుకుంటూ వెళ్ళాడు. దీంతో థియేటర్ తో పాటు అల్లుఅర్జున్ ఏ11 గా పై కేసు నమోదు చేశారు. అతను బాధ్యతారాహిత్యంగా మాట్లాడడంతో అరెస్ట్ చేశారు” అని..  అక్కడేం జరిగిందో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పూర్తిగా వెల్లడించారు. 
    *  *  *

    Leave A Comment